కొడకంచి: వెయ్యేళ్ళ చరిత్ర, కంచిలో మాదిరి పూజావిధానాలు

ఈద్ రోజు సెలవ ఉండటంతో అమ్మా-నాన్నలతో కలిసి మేడ్చల్ దెగ్గర 3-4 గుళ్ళకి వెళ్ళొద్దాం అనుకున్నా. కానీ అమ్మకి వేరే పని ఉండటంతో మేడ్చల్ ప్లాన్ విరమించుకుని నేనూ నాన్నా కొడకంచిలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం దర్శించుకుని వద్దామని ఉదయం 9 గం.లకు బయలుదేరాము. మా ఇంటి నుంచి 30 నిమి. దూరమే! నేను ఇంతకమునుపు ఒకసారి ఈ గుడికి వెళ్ళాను, నాన్నకి మాత్రం మొదటిసారి. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన దేవాలయం ఇది. సంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలోనే బ్రహ్మసూత్ర శివలింగం, నందీశ్వరుడు, అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నాయి. ఆనాటి రాతి, డంగు-సున్నం కట్టడాలు, ద్వారాలు చూస్తే అదో రకమైన హాయి కలిగింది. పెద్ద పెద్ద చెక్క తలుపులు, వాటికి వేసే ఇనుప గొళ్ళాలే ఒక కిలో బరువు ఉన్నట్టు అనిపించాయి. బయట మండుటెండ ఉన్నా, ఆ రాతి కట్టడాల కింద ఉన్నంతసేపూ చల్లగా, హాయిగా ఉండింది. దర్శనం వెంటనే అయిపోయింది. కంచిలో మాదిరిగానే ఇక్కడ కూడా బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి. పూజా విధానాలు అన్నీ కంచిలో జరిగినట్టే జరుగుతాయని అక్కడ ఉన్న అర్చకులు మాకు చెప్పారు. స్థలపురాణం ఒక బ్యానరుపై ప్రింట్ చేశారు. ...